Wednesday, December 24, 2014

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

చెప్పుకోడానికి సాఫ్ట్ గానే ఉంటుంది కానీ లోపలికి వెళ్తే కానీ తెలీదు ఎంత హార్డ్ అని.

ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం….
నా అడ్రెస్ ఏంటి అని ఎవరైన అకస్మాత్తుగా అడిగితే D-60 అని నా క్యూబికల్ అడ్రెస్ చెప్పుకునే స్థాయికి ఎదిగిపోయాను.

సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అనేవి నేను చదువుకునే రోజుల్లో ఉండేవి. ఇప్పుడు చూద్దాం అంటే సూర్యుడే లేడు ఇంకా ఉదయాలు అస్తమయాలు ఎక్కడ చూస్తాంలే. బయట సూర్యుడు కనిపించినప్పుడు పగలు చంద్రుడు కనిపించినప్పుడు రాత్రి అని గుర్తుపట్టేవాణ్ణి ఒకప్పుడు. ఇప్పుడు నా కంప్యూటర్ లో కుడివైపు కింద AM మరియు PM అని చూసి గుర్తుపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పగలు రాత్రి అనేవి మా ఆఫీస్లో ఎప్పుడు ఒకేలా ఉంటాయి.

నిద్ర లేవడం, ఆఫీస్ వెళ్ళడం, లాగ్ఔట్ చెయ్యడం, పడుకోవడం… ఇవి మాత్రమే నేను ఒక్కరోజులో చెయ్యగలిగే అత్యధిక పనులు. ఈ సాఫ్ట్‌వేర్ CEO లు అందరు కలిసి Maggi కనిపెట్టి ఉంటారని నా బలమైన నమ్మకం. ఎందుకంటే భోజనం చెయ్యాలి అంటే 2 నిమిషాల్లో తయారవుతుంది కాబట్టి. లేదంటే ఒక గంటసేపు భోజనం కి కేటాఇస్తే ఎన్ని పని గంటలు దుబార.

ఒకసారి Weekend లో అత్యవసరం అయ్యీ ఆఫీస్ కి రావాలి అని సడన్ గా ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను చెప్పాను అయ్యా మహాశయా నేను సినిమా థియేటర్ లో ఉన్నాను అని. క్యాబ్ సరాసరి నేరుగా సినిమా థియేటర్ కి వచ్చి నన్ను పిక్ చేసుకుని ఆఫీస్ కి తీసుకెళ్లింది. (Ofcourse, నేనే పంపించామన్నాను థియేటర్కి రూంకి వెళ్లే ఓపిక లేక). బహుశా ఇలాంటి అరుదైన సంఘటనలు చాలానే జరిగాయి నా జీవితంలో.

ఒకే రూమ్ ఒకే ఆఫీస్ లో పని చేస్తూ కూడా వారానికి ఒక్కసారే కలుసుకుని ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? నన్ను అడగండి ఆ బాధ గురించి బాగా వర్ణించగలను. ఒకడు రూంకి వెళ్లేసరికి ఇంకొకడు ముసుగు తన్ని నిద్ర పోవడం లేదా ఒకడు నిద్ర లేచేసరికి ఇంకొకడు ఆఫీస్ కి వెళ్లిపోవడం జరిగేవి. అప్పుడప్పుడు weekend లో కలుసుకుని ఒకరి బాధలు ఇంకొకరికి చెప్పుకుని కాస్సేపు వల వల ఏడిచి ఒకరి కన్నీళ్ళు ఒకరం తుడుచుకునేవాళ్ళం.

ఇండియాలోనే తెల్లదొరల సంస్కృతిని పాటించాను నేను అని గర్వంగా చెప్పుకునే విషయాలలో నా భోజన విషయం తప్పకుండా ఉండి తీరాలి. Maggi మరియు Sandwich లతో కడుపు నింపుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే ఒంట్లో ఉన్న శక్తి పూర్తిగా ఐపోయాకనే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి అన్న నిబంధన వల్ల ఇంట్లో వండుకునే ఓపిక లేక ఆకులు అలములు తినేవాణ్ణి.

ఒంట్లో యువరక్తం ఉన్నప్పుడు కలలో కథానాయికలు వస్తారని ఎవరో చెప్పగ విన్నాను. నేను ఎలాగైనా కనీసం ఒక కథానాయికతోనైనా కలలో Dream Song వేసుకోవాలని బలవంతంగా నిద్రపోయిన సంధర్భాలు కోకొల్లలు. కానీ PDF, Excel, Word Files మాత్రమే నాతో చిలిపి పనులు చేసేవి కలలో కూడా.

నీ పేరు ఏంటి అని ఎవరైన అడిగినప్పుడు…. నా పేరు ఉపేందర్ అని పాస్‌వర్డ్ Confidential అని చెప్పుకోవడం కూడా జరిగేవి. ఇంట్లో కి వెళ్ళడానికి Access Card తో Swipe చేసి వెళ్ళడానికి ప్రయత్నించే నన్ను చూసి ఏదైన దెయ్యం పట్టిందేమో అని మా అమ్మ కంగారు పడడం కూడా నేను మర్చిపోలేను.

ఇంట్లో ఉన్న ఈగలు బొద్దింకలు చూసి ఇంకా debugging ఎందుకు చెయ్యలేదు అని అడగడం, ఊళ్ళో ఉన్న ముసలి వాళ్ళతో ఏదైన సంభాషణ జరిపి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ email ఏంటి అని అడగడం వాళ్ళు నన్ను అడివి మనిషి ని చూసినట్టు చూడడం కూడా నా దైనందిక జీవనంలో భాగం అయ్యాయి.

సరే ఐతే మళ్లీ ఎప్పుడైనా విపులంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆఫీస్ లాగ్ ఇన్ సమయం ఆసన్నమైంది….
ఉంటాను మరి…..

బై బై….

ఉపేందర్

8 comments:

  1. Its 100% True..... inkaa mana kashtaalu chaalaa vunnaayi kadaa andi... 2nd part continue cheyandi..

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి జాహ్నవి గారు దీనికి పార్ట్ 2 కూడా రాయొచ్చు. ఎన్ని పార్ట్‌లు రాసిన సాఫ్ట్‌వేర్ కష్టాలకు సాటి రావు.

      Delete
  2. నిజమే. బాగా వ్రాసారు. రోజులు మారిపోయాయి బాగా (నా చిన్నప్పటితో పోలిస్తే ఎక్కడా పోలికలు లేనంతగా). ఉన్నది ఉన్నట్లుగా రెండుముక్కలు వ్రాసారా - అదిప్పుడు చదవటానికి hilarious ఉందంటే ఏం చెప్పాలీ! కల్మ కల్మ! నిజంగానే భలేగా hilarious ఉంది!

    ReplyDelete
  3. చాలా బాగా వ్రాసారు.
    http://telugufinancialschool.blogspot.com/

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

      Delete
  4. చాలా బాగా చెప్పారు మీ బాధలని.నాకైతే ఇది చదువుతుంటే ఏమనిపించిందో తెలుసా? సినిమా చూస్తున్నపుడు ఏదైనా సీన్ బాగా నచ్చితే అబ్బాయిలు విజిల్ వేస్తారు కదా అలా చేయాలనిపించింది.

    ReplyDelete