Saturday, October 10, 2015

తేనెటీగ

ఆ రోజు ఆఫీస్ లో పని కాస్త ఎక్కువగానే ఉంది. ఎప్పుడు లేనిది ఆ రోజు పని ఎక్కువగా ఉండేసరికి కాస్తంగా చిరాకుగా పని చేసుకుంటున్నాను. ఎందుకో ఆ రోజు ఎప్పుడూ ఉన్నంత హుషారుగా లేను. కొంచం బద్దకం, కొంచం అసహనం, ఎవరిమీదో ఎందుకో తెలీని కోపం ఇలా ఒక రోజునీ చెడకొట్టుకోవడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఏదైన రొటీన్ అయిపోతే ఇలాగే ఉంటుంది ఏమో! చీ ఏదవ కూలీ బతుకు!!! ఎప్పుడూ ఆఫీస్ కి రావడం, పని చెయ్యడం, ఇంటికెళ్లి పడుకోవడం తప్ప ఇంకా ఏ పని లేకుండా పోతుంది అని నన్నూ, మా మ్యానేజర్ ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, బరాక్ ఒబామా ని కసితీరా తిట్టుకుంటూ పని చేసుకుంటున్నాను. ఎవరిమీద కోపం చూపించాలో తెలికపోతే ఇలా భూమ్మీద ఉండే పెద్దమనుషులను తిట్టాలి ఒకానొక బలహీన క్షణంలో నాకు నేనే నిర్ణయించుకున్నాను. 
ఇంతలో ఎవరిదో ఫోన్ మోగడం వినిపించి ఎవడు వాడు ఫోన్ సైలెంట్ లో పెట్టకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుని పనిలో నిమగ్నమయ్యాను. కాని వాడెంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో ఎక్కడో మీటింగ్‌లో ఉండి ఉంటాడు ఎంత ముఖ్యమైన ఫోన్ వచ్చిందో అని కాసేపు బాధ పడ్డాను. కళ్ళలో నుండి రెండు మూడు చుక్కల నీళ్ళు కూడా వచ్చాయి.  
అయిన అలాంటి పాటనీ రింగ్టోన్గా పెట్టుకుంటాడా ఎవడైనా?  
అసలు ఆ పాట ఏంటి అలా ఉంది?  
అలాంటి పాటని సినిమా లో పెట్టినందుకూ దర్శకుడిని, ఒప్పుకున్నందుకు నిర్మాతని కాల్చి పడెయ్యాలి. ఈ మధ్యన బొత్తిగా చెడిపోయింది సినిమా. 
విలువలతో కూడిన సినిమా లే రావడం లేదు (విలువలతో కూడిన సినిమా అని ఎక్కడో విన్నాను. అందుకని బాగుంది అని అలాగే ఇక్కడ వాడాను కానీ దాని అర్ధం ఏంటో నాకైతే తెలీదు). ఎప్పుడు చూసిన ద్వందార్ధ మాటలు పాటలు.  
సెన్సర్ బోర్డ్ ఏం చేస్తుంది?  
ఇలాంటివి చాలా అలోచించాను. వీలైతే అన్ని బాగు చెయ్యాలి అని అనుకున్నాను. ఇంతలో మా ఆవిడ ఎప్పటినుండో మిక్సీ పాడైపోయింది బాగు చేయించు అని అడగడం గుర్తొచ్చింది. మా ఆవిడ నా గురించి ఏం అనుకుంటుంది? నాకేం పని పాట లేదు అనుకుంటుందా? తనలాగ నేనేమైన ఖాళీగా ఉన్నాను అనుకుంటుందా? ఒక్కసారి బయటికొచ్చి నాలాగా జాబ్ చేసి చూస్తే తెలుస్తుంది నేను ఎంత కష్టపడుతున్నానో. మా మ్యానేజర్ లాగా, వాళ్లింట్లో కుక్క చేసిన పాడు పనికి వచ్చిన కోపాన్ని కూడా ఆఫీస్ లో నాలాంటి వాళ్ల మీద చూపించినట్టు నేను కూడా అన్ని కోపాలను నా భార్య మీద చూపిస్తే కానీ తెలిసి రాదు! అని లోకకళ్యాణం కోసం ఆలోచిస్తుండగా మళ్లీ అదే పాట వినిపించి ఇంకా చిరాకు పెట్టింది.  
ఎవడ్రా వాడు ఎంతో ఏకాగ్రతతో పని చేసుకుంటుంటే దిక్కుమాలినా రింగ్టోన్ పెట్టి డిస్ట్రబ్ చేస్తున్నాడు అని కొంచం కోపంగా అరిచాను. కానీ నా అరుపులని ఎవ్వడు పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవడికి తెలుగు రాదు. అది కూడా ఒకందుకు మంచిదేలే తెలుగులో ఎంత తిట్టిన ఎవడికి అర్ధం కాదు అనుకున్నాను. కానీ అందరు నావైపున పెళ్లిలో తాళిబొట్టు దొంగిలించిన దొంగని నేనే అన్నట్టుగా క్రూరంగా చూసేసరికి భయమేసి ఏమైంది అని ఇంగ్లీష్ లో అడిగాను. దానికి వాడు మొగుతున్న ఫోన్ నీదేరా శుంఠ అనడంతో హీహీహి సారీ అని చెప్పి 180 కిలోమీటర్ పర్ సెకన్ వేగంతో బయటికి పరిగెత్తాను. బయటికి వెళ్ళిన తర్వాతా మళ్లీ అంతకన్నా వేగంగా లోపలికి వచ్చి నా ఫోన్ తీసుకుని మళ్లీ బయటికి పరిగెత్తాను. 
ఏంటో ఇవ్వాళ్ళ అన్ని ఇలాగే జరుగుతున్నాయి. నా జాతకాన్ని ఎవరైన సిద్దాంతికి చూపించాలి ఏవైనా శాంతి పూజలు చేస్తే కానీ మనసు మనసులో ఉండేట్టు లేదు. ఇవ్వాల్ల పొద్దున నా మొహం అద్దంలో చూసుకున్నప్పుడే అనుకున్న ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. ఇంట్లో నుండి అద్దం తీసి బయట పడేయ్యాలి. లేదంటే లేవగానే ఎదురుగా అడ్డం లేకుండా చూసుకోవాలి. అసలే పని ఎక్కువగా ఉంది మరియు మూడ్ బాగాలేదు. ఆఫీస్ సెలవు పెట్టిన బావుండేది అనుకుంటూ పొద్దున నుండి ఇప్పటికీ జరిగిన ప్రతి పనిని మరొక్క సారి తిట్టుకుని అసలు ఎవరు ఇంతకీ ఫోన్ చేసింది అని ఫోన్ వైపు చూశాను. హోమ్ మినిస్టర్ (నా భార్య) నుండి వచ్చింది ఆ కాల్.  
ఎందుకు చేసిందబ్బా? 
నేనెప్పుడో పెళ్ళైన కొత్తలో ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక చీర తీసుకురమ్మంటే తీసుకురాలేదు అనే విషయం ఇప్పుడు గుర్తొచ్చి తిట్టడానికి ఫోన్ చేసిందేమో? 
సరే నిండా మునిగాక చలి ఎందుకు. ఇవ్వాల్ల ఎలాగూ నా జాతకం బాగాలేదు మహా అయితే ఇంకొక నాలుగు మాటలు పడాల్సి వస్తుంది. సొంత పెళ్లామే కదా ఏం పరవాలేదు అనుకుని ఫోన్ చేశాను.  
హెల్లొ హెల్లొ అని ఎంతసేపు అన్న ఎవ్వరూ మాట్లాడకపొయేసరికి ఎందుకో భయమేసింది. 
హెల్లొ హెల్లొ హెల్లొ.... ఉన్నావా? ఏమైంది??/??? 
------------------------------------------------------------------------------ 
------------------------------------------------------------------------------ 
------------------------------------------------------------------------------ 
------------------------------------------------------------------------------ 
ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత నాకెందుకో ఇంటికి వెళ్ళాలి అనిపించింది. నుదుటి మీద చెమటలు తుడుచుకున్నాను. కొంచెం గాబరాగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుండి వెళ్లిపోవాల అని ఉంది.  
మా మ్యానేజర్ ని ఇప్పుడు అనుమతి అడిగితే ఇస్తాడా? లేదా నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాజెక్ట్ డెలివరబల్ కూడా ఇప్పుడే చేసి వెళ్ళమంటాడా? అడిగితే ఖచ్చితంగా ఇవ్వడు. అందుకే అతన్ని మ్యానేజర్ అంటారు. చెప్పకుండా వెళ్ళిపోయడం ఉత్తమం. ఏదైతే అది అవుతుంది. అయిన ఇంకా రెండు గంటల్లో ఎలాగైనా ఆఫీస్ ఐపోతుంది. అప్పుడే వెళ్లాల? ఏం చెయ్యాలి అని కాసేపు ఆలోచించి అర్జెంట్ గా కడుపు నొప్పి తెచ్చుకుని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ప్రసవ వేధన అనుభవించినట్టు కాసేపు నాటకం ఆడినా తర్వాత ఇంటికి వెళ్ళమని పర్మిషన్ రావడంతో, కడుపు నొప్పి అని నాటకం ఆడుతున్న విషయం కూడా మర్చిపోయి 250 కిలోమీటర్ ల వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాను. 
ఇంటికి వెళ్లేసరికి 30 నిమిషాలు అయ్యింది. అంతసేపు ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. వెళ్ళగానే సరాసరి బూట్లు కూడా తియ్యకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయాను. అక్కడే చిన్న చిన్న కార్లను ఏకాగ్రతతో నడుపుతూ ఉన్నాడు. ఆక్సిడెంట్ అవుతుందో లేదో అనే టెన్షన్ లో ఉన్నాడు..... 
ఎవరో కాదు నా కొడుకు... పదిహేను నెలల వయసున్న నా కొడుకు. నన్ను చూసి పరిగెత్తుకుంటూ "నాన్నా" "నాన్న" అనుకుంటూ వచ్చాడు దగ్గరికి. అవును నన్ను మొదటి సారిగా నాన్న అని పిలిచాడు. (ఇదే విషయం అప్పుడు ఫోన్ చేసి చెప్పింది నా భార్య.) 
ఆఫీస్, జీతం, సినిమా, డబ్బులు, తినడం, పడుకోవడం ఇది మాత్రమే కాకుండా చాలా రోజుల తర్వాత (సంవత్సరాల) అసలైన ఆనందాన్ని అనుభవించాను. ఎంత అద్భుతమైన రోజు. పొద్దున నుండి పడిన శ్రమ అంత ఒకే ఒక్క క్షణంలో పోయింది. మళ్లీ కొన్ని నెలలకి సరిపడా కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ అనుభూతి ముందు ఏధైనా దిగదుడుపే. 
నా కొడుక్కి మిలింద్ అని పేరుపెట్టినందుకు ఏమో తేనె పలుకుల లాగా తియ్యగా పలుకుతున్నాడు. అవును మిలింద్ అంటే తేనెటీగే. 

Wednesday, August 19, 2015

ఆటో జానీ


ధనికుడు అంటే ఎవరు? 

బాగా ధనికుడు అంటే పూణేలో రోజు ఆటోలో ఆఫీస్ కి వెళ్ళి తిరిగి ఆటోలో వచ్చేవాడు. అవును ఇది నేను ఇక్కడికి వచ్చిన ఒకే ఒక్క సంవత్సరంలో బాగా పరిశోదించి కనుక్కున్న నగ్న సత్యం. అధికారపక్షం వాళ్ళు 2*2=4 అంటే కూడా విభేదించే ప్రతిపక్షం వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఒప్పుకునే ఒకే ఒక్క ప్రతిపాదన ఇది.  

ఆటోలో కూడా చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవాలి అంటే డబ్బులు ఒక్కటే సరిపోదు కూసింత అదృష్టం కూడా ఉండాలి. అసలు వాళ్ళను పలానా చోటుకీ వెళ్ళడానికి ఒప్పించడం కంటే తాలిబాన్లకు శాంతిసందేశం గురించి బోదించి వాళ్ళను మహాత్ములుగా మార్చడం చాలా సులభం. ఈ విషయం కూడా ఏదో నోటిమాటగా ఊరికే చెప్తున్నది కాదు ఎన్నో అనుభవాల నుండి నేర్చుకున్న గొప్ప గుణపాఠం. 

ఆటోవాల1: 

నేను: భయ్యా, lohegoan కి వస్తారా? 
ఆటో: Lohegoan లో ఎక్కడ? 
నేను: గురుద్వార్! 
ఆటో: గురుద్వార్ లో ఎక్కడ? 
నేను: గురుద్వార్ వరకు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. దానికన్నా ముందే first left తీసుకుంటే సరి! 
ఆటో: నేను రాను. 

ఆటోవాల2: 

నేను: భయ్యా, lohegoan కి వస్తారా? 
ఆటో: Lohegoan లో ఎక్కడ? 
నేను: గురుద్వార్! 
ఆటో: గురుద్వార్ లో ఎక్కడ? 
నేను: గురుద్వార్ వరకు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. దానికన్నా ముందే first left తీసుకుంటే సరి! 
ఆటో: నేను రాను. 

నేను: ఓ! గురుద్వార్ కి రారు అనుకుంట. ఇప్పుడు అడిగే వాళ్ళని lohegoan బస్స్టాండ్ వరకే అని అడగాలి. 

ఆటోవాల3: 

నేను: భయ్యా, lohegoan కి వస్తారా? 
ఆటో: Lohegoan లో ఎక్కడ? 
నేను: lohegoan బస్ స్టాండ్ వరకు వస్తే చాలు. 
ఆటో: నేను రాను 

ఆటోవాల 4: 

నేను: భయ్యా, lohegoan కి వస్తారా? 
ఆటో: Lohegoan లో ఎక్కడ? 
నేను: lohegoan బస్ స్టాండ్ వరకు వస్తే చాలు. 
ఆటో: నేను రాను 

ఆటోవాల 5: 
నేను: భయ్యా, lohegoan కి వస్తారా? 
ఆటో: Lohegoan లో ఎక్కడ? 
నేను: అసలు lohegoan కి వస్తావా? రావా? 
ఆటో: రాను 
నేను: మరెందుకు అడిగిగావ్ lohegoan లో ఎక్కడ అని? 
ఆటో: అలా అడగడం నా ప్రాథమిక హక్కు కాదనడానికి నువ్వెవర్రా! అన్నట్టు గుడ్లురిమి చూసి వెళ్ళిపోయాడు. 

అదేంటో మనం వెళ్లే ప్రాంతానికి తప్ప పాకిస్తాన్ కి అయిన సరే వచ్చేస్తా అంటారు కానీ మనం వెళ్లే ప్రాంతానికి మాత్రమే రారు. ఎందుకో మనకు తెలీదు వాళ్ళూ చెప్పరు! అసలు ఇలా కాదు ఏధైనా వేరే ప్రాంతానికి వెళ్తాం అని చెప్పి అక్కడికి రాను అంటే నేను వెళ్లాల్సిన చోటుకీ వస్తారేమో కనుక్కుందాం అని ప్రయత్నించాను. 

ఆటోవాల 6: 
నేను: భయ్యా, ఎరవాడ కి వస్తారా? 
ఆటో: వస్తాను. 

నా మొహం లో నెత్తురు చుక్క లేదు. ఎలాగోలా తప్పించుకుని వెళ్ళిపోయాను అక్కడినుండి.  

అక్కడే రోడ్ పైనే పడుకుంటే బాగోదు కాబట్టి ఎలాగైనా రూమ్ కి వెళ్ళి పడుకోవాలని ఇంకొక ఆటో దగ్గరికి వెళ్ళి, నేనే ఆటో డ్రైవ్ చేస్తా కావాలంటే నువ్వు నా మొబైల్ లో గేమ్స్ ఆడుతూ అలా కూర్చో, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా అని కళ్ళనీళ్ళు పెట్టుకుని బతిమాలితే ఒకతను రావడానికి ఒప్పుకున్నాడు. హమ్మయ్య మొత్తానికి ఎలాగైతేనేం సాధించాను అని సంతోషించేలోపు నెల జీతం అడిగాడు. అదేంటి కేవలం 5 కిలో మీటర్ లు మాత్రమే కదా? దానికే నెల జీతమా? అని అడిగితే ఏదో నేను కాబట్టే నెల జీతం అడిగాను ఇంకేవరైన అయ్యుంటే సంవత్సరం జీతం అడిగేవాళ్ళు అన్నాడు. తన దయార్ద హృదయానికి నా మనసు చలించి ద్రవీభవించి కళ్ళవెంబడి ధారలుగా బయటికి వచ్చింది. ఆనందంతో అప్పటికప్పుడు కోయ నృత్యం కాస్సేపు చేసి ఆటో లో ఎక్కి కూర్చున్నాను. అలా మొత్తానికి ఇంటికి చేరడం జరిగింది. 

వారాంతాలలో అయితే ఇంకా దారుణం. వాళ్ల ఆస్తి ఏదో మన పేరుమీద రాసినట్టు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. మిగతా రోజుల్లో అయితే కనీసం లక్ష కి ఒక రూపాయి చొప్పున అయిన తగ్గిస్తారు కానీ వారాంతంలో మీటర్ మీద 250% ఎక్కువ ఇస్తే కానీ కదలమూ అని భీష్మించుకుని కూర్చుంటారు. నాలాంటి బడుగు బలహీన వర్గ శ్రామిక జీవులకి మీటర్ డబ్బులు కట్టాలంటేనే బాంక్‌లో పర్సనల్ లోన్ తీసుకుంటే కానీ కుదరదు. అలాంటిది మీటర్ మీద 250% అంటే EMI కి మార్చుకుని ప్రశాతంగా ఒక జీవిత కాలానికి కట్టాలి.  

ఒకానొక దురదృష్ట రోజున నా ఖర్మకాలి సినిమా చూడాలి అని దుర్బుధ్ధి పుట్టి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకు ముందు లాగా సినిమా హాల్ లో వరుసలో నిలబడి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ లోనే తీసుకోవచ్చు కావున ఒకటి ముందుగానే బుక్ చేసుకుని ఆట సమయానికి ఒక గంట ముందుగా బయలుదేరడం జరిగింది. కానీ 2 కిలో మీటర్ ల దూరం నడుచుకుంటూ వెళ్ళడానికి సరిపోతుంది కానీ ఆటో లో వెళ్ళడానికి అస్సలు సరిపోదు అని ఆ రోజే తెలిసివచ్చింది.  

ఆటో వేసుకుని అంగారక గ్రహానికి రావడానికి కూడా సిద్దంగా ఉన్నారు కానీ నేను వెళ్లాల్సిన సినిమా థియేటర్ కి మాత్రం రాకూడదని మూకుమ్మడిగా నిర్ణయించుక్కున్నట్టున్నారు. ఒక అర్ధగంట సేపు చాలామందిని బతిమాలినా తర్వాత ఎడారి లో ఓయాసిస్ లాగా ఒకతను రావడానికి సిద్దమే అని ప్రకటించాడు. ఆ కరుణామయుడు దేవలోకం నుండి దిగి సరాసరి నా దగ్గరికే వచ్చినట్టు అనిపించింది. కానీ ఎన్ని నెలల జీతం అడుగుతాడో అని భయపడుతూనే ఆటో ఎక్కడం జరిగింది. ఆటో ఎక్కి ఎక్కగానే ఉన్న ముప్పై ఆరు పళ్లను నావైపు చూపించి డైరెక్ట్ నాలుగో గేర్ లో ఆటో ని ముందుకి పోనిచ్చాడు. ఆ వేగానికి ముందుకి తూలి ముందున ఉన్న ఇనుప రాడ్ కి తల తగిలి కొంచెం రక్తం వచ్చింది. స్పృహ తప్పకపోవడం మరియు నా తల కూడా పగలకపోవడంతో ఆనందంతో మూర్చపోయాను. అసలు ఆటో అంత సున్నితంగా నడుపుతాడని ఏమాత్రం తెలీని నేను ఆనందంలో గావుకేక కూడా పెట్టాను. ఏమయ్యింది అని ఆటో ఒక్కసారిగా ఆపి వెనక్కి తిరిగి చూసాడు చోదకుడు. హిహిహి ఏమీ అవ్వలేదు మనం త్వరగా సినిమా కి వెళ్ళాలి అని అన్నాను. అలాగే అని మళ్లీ ఆటో ని ముందుకు కదిలించాడు. ఈసారి కూడా సరాసరి నాలుగో గేర్ వేస్తాడని ఊహించి ముందుగానే రాడ్ ని గట్టిగా పట్టుకోవడం తో దెబ్బలు తప్పించుకున్నాను. ఇంతలో నాకొక విషయం గుర్తుకు వచ్చింది అసలు నా జీతం అడక్కుండానే ఆటో ని తీసుకెళుతున్నాడు అని. ఆ విషయమే గుర్తు చేశాను. దానికి చోదకుడు వికటాట్టహాసం నేను మీటర్ ఎంత అయితే అంతే డబ్బులు తీసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు నాకు నిజంగానే దేవుడే భువీ నుండి దిగివచ్చి మరి నా మాటల ఆలకించాడేమో అని అనిపించింది. ఇక్కడ ఆటో ని మీటర్ మీద నడపడం అంటే తన ఆస్తి అంత నా పేరు మీద రాయడంలా భావించే వాళ్ళను చూశాను కానీ ఇలా నిజంగానే త్యాగం చేసే వాణ్ణి మొట్టమొదటి సారిగా చూడడంతో ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తర్వాత ఆనందం తట్టుకోలేక మూర్చ పోవడం కూడా జరిగింది.  

అలా ఎంత సేపు పడి ఉన్నానో తెలీదు కానీ కాసేపయ్యాక నా మీద వర్షం పడడంతో లేచి కూర్చున్నాను. అదేంటి వర్షం పడుతుంది అనుకునే లోపు అర్ధం అయ్యింది ఏంటంటే చోదకుడే నా మీద కాసిన్ని నీళ్ళు కొట్టి లేపాడు అని. కళ్ళు నులుముకుని పక్కకు చూసి హమ్మయ్య సినిమా థియేటర్ వచ్చింది అని సంతోషపడ్డాను. అప్పుడు డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళడానికి మీటర్ వైపు చూసి మళ్లీ కళ్ళు తిరిగి పడిపోయాను. ఇలాంటి సంఘటనలు చాలా చూసి ఉండడం వల్ల అనుకుంటా ఏ మాత్రం భయపడకుండా మొహం మీద ఒక్క గుద్దు గుద్ది లేపాడు. లేవగానే ఆగ్రహం బాధ భయం తో చోదకుడితో ఆదేమైన మీటరా? లేక మొన్న NASA అంగారకుడి మీదకు పంపిన రాకెట్ ఆ? అని అడిగాను. దానికి ఆ చోదకుడు మిక్కిలి వీరవేశంతో ఊగిపోయాడు. అసలు తాను ఈ దేశాన్ని ఎలా ఉద్దరించింది, తన వల్లనే మన దేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది, తన నిజాయితీకి గాంధీ గారు ఎలా సంతోషించిది అన్ని విషయాలను కూలంకశగా వివరించాడు. చేసేది ఏమీ లేక నా ATM Card ఇచ్చి పిన్ నంబర్ తనకి చెప్పి, నాలుగు బ్లాంక్ చెక్స్ ఇచ్చి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి, ఏడుస్తూ సినిమా చూశాను. 

సోదరసోదరీమనులారా ఇందు మూలముగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఉద్యోగాలు అన్ని వదిలేసి ఒక ఆటో కొనుక్కుని పూణే లో ఒక్క పూట తిప్పితే వచ్చే డబ్బులను బాంక్‌లో వేసుకుని వచ్చే వడ్డీతో కాలు మీద కాలేసుకుని బతికేయ్యండి అని. 


Saturday, July 11, 2015

నా పుత్ర రత్నం - బాహుబలి

నాన్న నాన్న మనం చానం (స్నానం) చేద్దామా?

స్నానమా? పొద్దునే చేసాము కదా బేటా?

షవర్ కింద చేద్దాం....!

షవర్ కిందనే కదా చేసింది పొద్దున?

అలా కాదు నాన్న (కోపంగా) నీకేం తెలీదు. నిన్న చూసిన సినిమా లో చేసినట్టు షవర్ కింద చేద్దాం.

బాహుబలి సినిమా లోన? అందులో షవర్ కింద ఎవరు చేశారు ఎప్పుడు చేశారు స్నానం? (కొంపదీసి తమన్నా సీన్ ఏమైన మిస్ అయ్యాన నేను?)

ప్రభాస్ చేశాడు కదా చాలా సార్లు. నువ్వు కూడా నిన్న సినిమా చూశావు కదా తెలీదా?

(బహుశా వాటర్ ఫాల్ గురించి అనుకుంట)

అదా! కానీ మన దగ్గర అంత పెద్ద షవర్ లేదు కదా! మళ్లీ ఎప్పుడైనా మనం పెద్దది కట్టుకుందాం. అప్పుడు చేద్దువు కానీ సరేనా?

సరే నాన్న! అవును నాన్నోయ్ నాకొక డౌటానుమానం

ఏంటది?

ఆయన ఎందుకు అన్ని సార్లు చానం చేశాడు? నేను చేస్తే నాకు ఆయ్ (జ్వరం) వస్తుంది అని తిడతావు కదా. మరేమో వాళ్ళమ్మ ఏమీ అనలేదు....

నిజంగా స్నానం చెయ్యలేదు ఆయన. చేద్దామని వెళ్ళి మద్యలోనే పడిపోయాడు కదా...!

మరి పడిపోయినప్పుడు దెబ్బలు తాకాలి కదా ఎందుకు తాకలేదు?

(త్వరగా విషయాన్ని పక్కకు మళ్లించకపోతే చాలా ప్రమాదం....)

అది తర్వాత చెప్తా కానీ ఇంతకీ నువ్వు అన్నం తిన్నావా? వెళ్లు వెళ్ళి తిను...

(ఇంతలో నా భార్య)
ఆడికి అన్నం వద్దు అంట! ఎంత చెప్పిన తినట్లేదు. అదేదో చేసి పెడితే కానీ తినడు అంట. అదేదో కనుక్కుని చెప్తే నేను చేసి పెడతాను.

ఏం కావాలి బెటా?

నాకు నల్ల లడ్డు కావాలి నాన్న....

నల్ల లడ్డా? అది ఎక్కడ చూశావు?

సినిమా లో గుండు అంకుల్ తింటాడు కదా. నల్ల లడ్డు నాకు కావాలి.

అది నువ్వు తినకూడదు బెటా. అది తిన్నందుకే అంకుల్ కి గుండు అయ్యింది. నువ్వు తింటే నీక్కూడా గుండు అవుతుంది మరి.

(తల మీద చెయ్యి పెట్టుకుని) వద్దు నాన్న. నల్ల లడ్డు ఏం అసలు బాగాలేదు . అందుకే గుండు అంకుల్ అది తినుకుంటూ ఏడ్చాడు.

మరి తినడానికి వెళ్లు.

అది కాదు నాన్న, పిచ్చి ఆంటీని (అనుష్క అవతారం చూసి అలా అనుకుని ఉంటాడు) కట్టేసారు కదా. ప్రభాస్ వచ్చి ఎందుకు అక్కడి నుండి ఫైటింగ్ చేసి పిచ్చి ఆంటీ ని తీసుకెళ్ళాడు?

(అసలు వీడిని సినిమా కు తీసుకెళ్ళడమే తప్పు. ఇప్పుడు స్టోరీ ఎలా చెప్పాలి చెప్తే మాత్రం ఏం అర్థం అవుతుంది)
అవన్నీ తర్వాత చెప్తా కానీ నువ్వు వెళ్ళి అన్నం తిను.

చెప్తేనే అన్నం తింట లేకపోతే నేను తినా (కోపంగా)....

(^&%#*&^$(*&$&)

పిచ్చి ఆంటీ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. అక్కడే కట్టేసి ఉంటే తగ్గదు కదా మరి, అందుకే తీసుకెళ్ళాడు. (శభాష్! భలే చెప్పావ్)
 
 మరి హాస్పిటల్ కి ఆంబ్యులెన్స్ లో వెళ్ళాలి కానీ గుర్రం బండి మీద ఎందుకు వెళ్లాడు. మనం ఏధైనా జాతర కి వెళ్ళినప్పుడు మాత్రమే గుర్రం బండి ఎక్కుతాం కానీ హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఎక్కలేదు కదా?

అక్కడ ఆంబ్యులెన్స్ పాడైంది అందుకే తొందరగా వెళ్ళాలి అని అక్కడ ఉన్న గుర్రం బండి మీద వెళ్లాడు.

మరి.........

(మధ్యలోనే అందుకుని)

అక్కడ గుర్రం బండి ఎందుకు ఉంది అనే కదా నీ అనుమానం?

అవును నాన్న!!

మరి దీని సమాధానం చెప్తే వెళ్ళి అన్నం తింటావు కదా???

ఆ సరే నాన్న. వెళ్ళి తింటాను...

అక్కడ పక్కనే ఏదో exhibition  జరుగుతుంది. అందుకే ఆంబ్యులెన్స్ లేదని అక్కడికి వెళ్ళి గుర్రం బండి తెచ్చుకుని, పిచ్చి ఆంటీ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లాడు... వెళ్లు వెళ్ళి ఇక అన్నం తిను...

ఆగు నాన్న తింటాను కానీ ఇంకొక కొచ్చెన్...

అది చెప్తే తింటా అన్నావు కదా వెళ్ళి తిను (కోపంగా)

తింటా అన్నాను కానీ ఇప్పుడే తింటా అనలేదు కదా నాన్న (ఇంకా కోపంగా)

సరే అడుగు తొందరగా.... దీనికి సమాధానం చెప్పిన తర్వాత వెళ్ళి ఇప్పుడే అన్నం తినాలి ఐతేనే చెప్తాను లేదంటే చెప్పాను, సరేనా?

సరే నాన్న. ఆ తెల్ల పిల్ల (తమన్నా) ఉంది కదా. మరి ఆమె చెరువులో చేతులు పెట్టి నిద్ర పోయినప్పుడు చేపలు ఆమె చెయ్యిని తినేసాయి కదా. మళ్లీ
చేతులు ఎలా వచ్చాయి?

అదా!! చేపలు నిజంగా చేతులను తినలేవు. ఊరికే అక్కడ చేతులతో ఆడుకున్నాయి.

మరి మొన్న చెరువు దగ్గర జాతరకి వెళ్ళినప్పుడు నేను అందులో ఆడుకుంటా అంటే, అందులో చేపలు ఉంటాయి మన చేతులని కాళ్ళని తినేస్తాయి అని చెప్పావు కదా?

(హే భగవాన్! ఇప్పుడు ఇంకేది చెప్పిన ఇంతకు ముందు చెప్పింది ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఏదో ఒకటి చేసి తప్పుంచుకోకపోతే చాలా కష్టం)

ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తింటే నేను నీకు ఒక కారు బొమ్మ కొనిస్తా. ఎప్పటి నుండో కావాలి కావాలి అంటున్నావ్ కదా వెళ్లు వెళ్ళి తొందరగా తిని రా షాప్ కి వెళ్దాం.

సరే నాన్న! అన్నం తిని వస్తా ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు.

(మళ్లీ జీవితం లో వీడిని సినమా కి తీసుకెళ్లకూడదు)

Saturday, June 20, 2015

కాలేజ్ రోజుల్లో....

​​
మనం కొంచెం ఫ్ల్యాష్‌బ్యాక్ లోకి వెళ్దాం. మీరు మొహం మీద రింగులు వేసుకుంటే నేను మెల్లిగా తీసుకెళ్తా....

సరేనా?..........

అది 2003 వ సంవత్సరం.... స్కూల్ లో దెబ్బలు తినే స్థాయి నుండి కళాశాలలో దెబ్బలు తినే స్థాయికి ప్రమోషన్ వచ్చిన రోజులు......

నాకు ఇంటర్మీడియేట్ లో ఉన్నన్ని అనుభవాలు గాంధీ గారికి జీవితకాలంలో ఉన్న అనుభవాల కన్నా ఎక్కువే అని ప్రగాఢ నమ్మకం. అది నిఝంగా నిజం కూడా. నేను హైదరాబాద్ కాలేజ్ లో చేరి నా విద్యా ప్రవాహాన్నీ కొనసాగిద్డాం అని ఎన్నో ప్రణాళికలు వేసుకున్న వేళ శుక్రుడు వక్రదృష్టితో చూడడం వలన అది కార్యరూపం దాల్చలేదు. అయిన సరే నేను ఈ లోకల్ కాలేజ్ లో చదివితే ఎక్కడ చెడిపోతానో అన్న భయం వల్ల నిజామాబాద్‌లోని కాలేజ్లో మా నాన్న గారు చేర్పించడం జరిగింది. కానీ అక్కడ చేరిన మొదటిరోజే ప్రిన్సిపల్ ఎవరో బడుగు బలహీన విధ్యార్థిని పట్టుకుని NTR విలన్లని బాదినట్టు బాదడం చూసి మిక్కిలి భయపడ్డాను. ఇంట్లో పెళ్ళాం మీద ఉన్న కోపాన్ని కాలేజ్లో విధ్యార్థులపై చూపిస్తాడని వేగుల సమాచారం మేరకు అక్కడే ఉంటే నా బతుకు ఇత్తడి మూకుడిలో మెత్తటి పకోడీ అవుతుందని గ్రహించి పెట్టె బేడా మూట ముల్లే సర్దుకుని పలాయనం చిత్తగించాను. అది తెల్సిన మా నాన్న మిక్కిలి కోపోద్రుక్తుడై సహస్రనామార్చన చేసి కుంకుడు కాయ పులుసు కంట్లో పోసి మరీ తలంటాడు.


ట్విట్టర్ లో అకౌంట్ లేని వాడికి ఫేస్‌బుక్క్కే దిక్కని అప్పటికీ అడ్మిషన్స్ పుణ్యకాలం కాస్త గడిచి పోవడంతో దగ్గరలోనే కాలేజ్ హాస్టల్లో చేర్పించక తప్పలేదు. అలా ఒకోనొకా దుర్ముహూర్తాన కాలేజ్ లో అడుగుపెట్టడం జరిగింది. నేను కాలేజ్ కి వెళ్ళిన మొదటి రోజే మా ప్రిన్సిపల్ కాస్త హరీ అన్నాడు. ఆ విధంగా మొదటి రోజు సెలవు లభించడంతో అట్టర్ ఫ్లాప్ ఐన సినిమా రీమేక్ రైట్స్ని భారీ రేట్ కి అమ్మిన ప్రొడ్యూసర్ లాగా తెగ ఆనందపడిపోయి కోయ డ్యాన్స్ లు గట్రా (గట్రా అంటే ఏమిటో అదేలా చేస్తారో తెలీదు) చేశాను. ఇన్ని అపశకునాల మధ్య ప్రారంభించిన నా కాలేజ్ యాత్ర ఎలా కొనసాగుతుందో వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా....

నేను స్కూల్ లో ఉన్నప్పుడు అందరు టీచర్ లతో దెబ్బలు తిన్నాను కానీ ఒక లెక్కల మాస్టర్ తో మాత్రం దెబ్బలు తినలేదు ఎందుకంటే నా దృష్టిలో లెక్కల సబ్జెక్ట్ తప్ప మిగతావన్నీ అసలు సబ్జెక్ట్ లే కాదు. ఆవిధంగా ఆ రికార్డ్‌ని ఎలాగైనా కాపాడుకోవాలి ముందే కంకణం కట్టుకుని మరి కాలేజ్ లో అడుగుపెట్టాను. 

కానీ సముద్రం ఉప్పొంగింది.
అగ్నిపర్వతం బధ్ధలయ్యింది.
విధి వక్రించింది.
బాలకృష్ణ సినిమా హిట్ అయ్యింది.

అలాంటి ఎఫెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ లో జరిగాక కొన్ని రోజుల్లోనే నాకు అర్ధం అయ్యింది ఏంటంటే మా మేథ్స్ టీచర్ కి, "విధ్యార్థులని ఎలా కొడితే బావుంటుంది" అనే దేశంలో ఉన్న అతి సంక్లిష్టమైన మరియు అతి ముఖ్యమైన విషయం మీద పరిశోధన చేసే Ph.D విధ్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడంలో 42 సంవత్సరాల అనుభవం (ఆయన వయసు 40 ఉండొచ్చు సుమారుగా) ఉంది అని.

                                                                         (ఇంకా ఉంది)