Wednesday, December 24, 2014

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

చెప్పుకోడానికి సాఫ్ట్ గానే ఉంటుంది కానీ లోపలికి వెళ్తే కానీ తెలీదు ఎంత హార్డ్ అని.

ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం….
నా అడ్రెస్ ఏంటి అని ఎవరైన అకస్మాత్తుగా అడిగితే D-60 అని నా క్యూబికల్ అడ్రెస్ చెప్పుకునే స్థాయికి ఎదిగిపోయాను.

సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అనేవి నేను చదువుకునే రోజుల్లో ఉండేవి. ఇప్పుడు చూద్దాం అంటే సూర్యుడే లేడు ఇంకా ఉదయాలు అస్తమయాలు ఎక్కడ చూస్తాంలే. బయట సూర్యుడు కనిపించినప్పుడు పగలు చంద్రుడు కనిపించినప్పుడు రాత్రి అని గుర్తుపట్టేవాణ్ణి ఒకప్పుడు. ఇప్పుడు నా కంప్యూటర్ లో కుడివైపు కింద AM మరియు PM అని చూసి గుర్తుపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పగలు రాత్రి అనేవి మా ఆఫీస్లో ఎప్పుడు ఒకేలా ఉంటాయి.

నిద్ర లేవడం, ఆఫీస్ వెళ్ళడం, లాగ్ఔట్ చెయ్యడం, పడుకోవడం… ఇవి మాత్రమే నేను ఒక్కరోజులో చెయ్యగలిగే అత్యధిక పనులు. ఈ సాఫ్ట్‌వేర్ CEO లు అందరు కలిసి Maggi కనిపెట్టి ఉంటారని నా బలమైన నమ్మకం. ఎందుకంటే భోజనం చెయ్యాలి అంటే 2 నిమిషాల్లో తయారవుతుంది కాబట్టి. లేదంటే ఒక గంటసేపు భోజనం కి కేటాఇస్తే ఎన్ని పని గంటలు దుబార.

ఒకసారి Weekend లో అత్యవసరం అయ్యీ ఆఫీస్ కి రావాలి అని సడన్ గా ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను చెప్పాను అయ్యా మహాశయా నేను సినిమా థియేటర్ లో ఉన్నాను అని. క్యాబ్ సరాసరి నేరుగా సినిమా థియేటర్ కి వచ్చి నన్ను పిక్ చేసుకుని ఆఫీస్ కి తీసుకెళ్లింది. (Ofcourse, నేనే పంపించామన్నాను థియేటర్కి రూంకి వెళ్లే ఓపిక లేక). బహుశా ఇలాంటి అరుదైన సంఘటనలు చాలానే జరిగాయి నా జీవితంలో.

ఒకే రూమ్ ఒకే ఆఫీస్ లో పని చేస్తూ కూడా వారానికి ఒక్కసారే కలుసుకుని ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? నన్ను అడగండి ఆ బాధ గురించి బాగా వర్ణించగలను. ఒకడు రూంకి వెళ్లేసరికి ఇంకొకడు ముసుగు తన్ని నిద్ర పోవడం లేదా ఒకడు నిద్ర లేచేసరికి ఇంకొకడు ఆఫీస్ కి వెళ్లిపోవడం జరిగేవి. అప్పుడప్పుడు weekend లో కలుసుకుని ఒకరి బాధలు ఇంకొకరికి చెప్పుకుని కాస్సేపు వల వల ఏడిచి ఒకరి కన్నీళ్ళు ఒకరం తుడుచుకునేవాళ్ళం.

ఇండియాలోనే తెల్లదొరల సంస్కృతిని పాటించాను నేను అని గర్వంగా చెప్పుకునే విషయాలలో నా భోజన విషయం తప్పకుండా ఉండి తీరాలి. Maggi మరియు Sandwich లతో కడుపు నింపుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే ఒంట్లో ఉన్న శక్తి పూర్తిగా ఐపోయాకనే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి అన్న నిబంధన వల్ల ఇంట్లో వండుకునే ఓపిక లేక ఆకులు అలములు తినేవాణ్ణి.

ఒంట్లో యువరక్తం ఉన్నప్పుడు కలలో కథానాయికలు వస్తారని ఎవరో చెప్పగ విన్నాను. నేను ఎలాగైనా కనీసం ఒక కథానాయికతోనైనా కలలో Dream Song వేసుకోవాలని బలవంతంగా నిద్రపోయిన సంధర్భాలు కోకొల్లలు. కానీ PDF, Excel, Word Files మాత్రమే నాతో చిలిపి పనులు చేసేవి కలలో కూడా.

నీ పేరు ఏంటి అని ఎవరైన అడిగినప్పుడు…. నా పేరు ఉపేందర్ అని పాస్‌వర్డ్ Confidential అని చెప్పుకోవడం కూడా జరిగేవి. ఇంట్లో కి వెళ్ళడానికి Access Card తో Swipe చేసి వెళ్ళడానికి ప్రయత్నించే నన్ను చూసి ఏదైన దెయ్యం పట్టిందేమో అని మా అమ్మ కంగారు పడడం కూడా నేను మర్చిపోలేను.

ఇంట్లో ఉన్న ఈగలు బొద్దింకలు చూసి ఇంకా debugging ఎందుకు చెయ్యలేదు అని అడగడం, ఊళ్ళో ఉన్న ముసలి వాళ్ళతో ఏదైన సంభాషణ జరిపి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ email ఏంటి అని అడగడం వాళ్ళు నన్ను అడివి మనిషి ని చూసినట్టు చూడడం కూడా నా దైనందిక జీవనంలో భాగం అయ్యాయి.

సరే ఐతే మళ్లీ ఎప్పుడైనా విపులంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆఫీస్ లాగ్ ఇన్ సమయం ఆసన్నమైంది….
ఉంటాను మరి…..

బై బై….

ఉపేందర్

Sunday, December 21, 2014

10 సంవత్సరాల భయంకర జీవితం

నేను ఒక భయంకరమైన ప్రదేశంలో భయపడుతూ 10 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. దానివల్ల రసాలు అనగానే మామిడి రసం మరియు కర్భూజ రసం మాత్రమే గుర్తుకు వచ్చే నాకు మొదటిసారిగా భయానక రసం అనేది ఒకటి ఉంటుందనీ అదంటే నేను భయపడుతాను అని తెల్సివచ్చింది. ఐన సరే పది సంవత్సరాలు ఆ భయంకరమైన గదుల్లోనే గడపాల్సి వచ్చింది. అక్కడినుండి నేను బయటపడి ఇప్పటికీ 11 సంవత్సరాలు గడిచిన ఎప్పుడైనా ఆ విషయం గుర్తుకు వస్తే వెన్నులో వణుకు పుడుతుంది ఆ పైన నవ్వుకూడా వస్తుంది. ఇంతకీ అదేంటో తెల్సుకోవాలి అనుకుంటే మీ కళ్ళను ఈ అక్షరాల వెంట అలాగే పరిగెత్తించండి.

స్కూల్, పాఠశాల, బడి పేరు ఏది అయితేనేం అదంటే నాకు భయం. కుక్కల కంటే కూడా ఎక్కువ భయం. మా ఊరి నుండి 3 వ తరగతికి పక్కవూరికి వెళ్లాల్సి వచ్చింది మొదటిసారిగా. అప్పుడు నాకు 3+4=7 సంవత్సరాలు ఉంటాయి. ప్రధానోపాధ్యాయుడు నీకు వచ్చిన పద్యాలు చెప్తేనే అడ్మిషన్ ఇస్తా అనడంతో నాకు తెల్సిన 6 పద్యాలు అర్ధం తెలీకపోయిన గడగడా పంతులు మంత్రాలు చదివినట్టు చదివేశా. అవి కూడా ఎలా వచ్చాయి అంటే "వొళ్ళంతా వాతలు వచ్చేలా తన్నులు తింటావా లేదా పద్యాలు బట్టీ పడతావా" అని సున్నితంగా బతిమిలాడే ఒక మాష్టారి గారి చలవ వల్ల. 

మొదటి పీరియడ్లోనే జైల్లో ఖైదీలను పలకరించడానికి లాఠీ ఊపుకుంటూ వచ్చిన జైలర్ లా వచ్చాడు మా సారువాడు. వచ్చి రాగానే "మామిడి చెట్టుకు చింతకాయలు ఎందుకు కాయవు" లాంటి ప్రశ్న ఏదో వేసి అందరినీ ఎప్పుడెప్పుడు కొడదామా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఆ ఉత్కంఠ స్థాయి ఎలా ఉంది అంటే నేను ఇవ్వాల్లే కొత్తగా వచ్చిన స్టూడెంట్ని అని చెప్పెలోపలే ఆ బెత్తమ్ నన్ను ముద్దాడడం జరిగిపోయింది. మా నాన్నను నాన్న అని పిలవడానికే భయపడే నేను ఆ స్కూల్లో చదవడం నా వల్లకాదు అని చెప్పలేకపోయాను.

హోమ్‌వర్క్ చెయ్యకపోతే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు సంబరపడే మాస్టర్ ల మధ్య నేను అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా నలిగిపోతున్నాను. ఆ స్కూల్ లో నా పరిస్థితి కాస్త దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా తయారయ్యింది. అలా మూడు దెబ్బలు ఆరు చీవాట్లతో ఎంతో ఉల్లాసంగా రోజులు గడుపుతున్న నాకు ఒక రోజు ఒక పిడుగు లాంటి వార్త తెలిసింది. అదే పిల్లల్ని ఉపాద్యాయులు సరిగ్గా కొడుతున్నారా లేదా అన్న విషయం మీద చర్చించి సరిగ్గా కొట్టడం లేదు అని మిక్కిలి బాధపడి స్వయంగా ప్రధానోపాధ్యాయుడు రంగంలోకి దిగాడు మమ్మల్ని కొట్టడానికి. కొట్టాలంటే కారణం కావాలి కాబట్టి ఏ కారణం చెప్తే ఎక్కువమంది దెబ్బలు తినడానికి అర్హులు అవుతారో ఆ విషయమే వచ్చి అడిగాడు మమ్మల్ని "హోమ్‌వర్క్ సరిగ్గా చెయ్యని వాళ్ళు లేచి నిలబడండి" అని.

హోమ్‌వర్క్ చెయ్యకపోవడం నా జన్మ హక్కు అని బలంగా నమ్మి దాన్ని మనసా వాచా కర్మణా పాటించే నేను అందరికన్నా ముందుగా లేచి నించున్నాను. నాలాగే ఇంకొంతమంది కూడా నిల్చున్నారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక క్రమపధ్ధతిలో బడితే పూజా చేసుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. నన్ను చూడగానే ఆయనకు ఉన్న రెండే రెండు కళ్ళను అగ్ని గోళాళ్ల మార్చి ఎప్పుడు హోమ్‌వర్క్ చెయ్యకపొయె నా గొప్పతనాన్ని కాసేపు వర్ణింఛి నాకు మ్రుష్టాన్నభోజనమ్ పెట్టి తన కడుపు నిండిపోవడం వల్ల తేన్చుకుంటూ వెళ్లాడు ప్రధానోపాధ్యాయుడు.

అలా 4 సంవత్సరాలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన నేను మా ఫ్యామిలీ మొత్తం వేరే ఊరు వెళ్ళడం వల్ల వేరే ఊళ్ళో ఉన్న స్కూల్ కి మారాల్సి వచ్చింది. ఆ ఊళ్ళో మా స్కూల్ కి మా ఇల్లుకి కనీసం 2 కిలోమీటర్ ల దూరం ఉండేది. ఇటుకలు లాంటి పుస్తకాలని గోనెసంచీ వంటి బాగ్ లో వేసుకుని రైల్వే కూలీ బస్తాలు మోసినట్టు మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాణ్ణి. ఈ స్కూల్ లో కూడా హోమ్‌వర్క్ చెయ్యని వాళ్ళచేత ఎప్పుడెప్పుడు కాజాలు తినిపిద్ధామా అని చూసే టీచర్ లనే చూశాను. హోమ్‌వర్క్ రాయని వాళ్ళను వాళ్ళు పిలవడం నేను గర్వంగా వెళ్ళడం బాధగా రావడం నిత్యకృత్యం అయ్యింది. 

ఇలా ఐతే మాట వినడం లేదు అని టీచర్ మా నాన్నని పిలిచి నా గొప్పతనాన్ని వర్ణింఛి చెప్పాడు. నా గొప్పతనాన్ని వర్ణిస్తున్నప్పుడు వాళ్ల  అభిమానం చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి మా నాన్నకి కళ్ళు తిరిగాయి. ఇంటికి వెళ్ళాక ఇంకొక్క సారి కడుపు నిండా భోజనం చేయించాడు మా నాన్న. ఐన సరే ఎవరి గురించో నేను మారితే బాగోదు అని అలాగే రోజులు గడిపేస్తున్న. 

ఇన్ని సంతోషకరమైన పరిస్థితుల మద్య దెబ్బలు తినుకుంటూ మద్య మద్యలో భోజనం (లంచ్ పీరియడ్ లో లంచ్) చేసుకుంటూ బతికేస్తున్నా. అలా  స్కూల్ బెల్ వింటే చాలు గుండె నొప్పి రావడం మొదలయ్యింది. ఎందుకంటే స్కూల్ లో పీరియడ్ చేంజ్ అవుతుంది అంటే నన్ను కొట్టే టీచర్ చేంజ్ అవుతున్నాడు అని అర్ధం. ఆ విధంగా స్కూల్ అంటే ఇప్పటికీ భయపడుతుంటాను.


తెలుగు టైపింగ్లో ఇబ్బందులని అర్ధం చేసుకుంటూ నా తప్పులని మన్నిస్తారని ఆశిస్తూ....


ఉపేందర్

Saturday, November 22, 2014

కుక్కలతో అనుబంధం

నాకు సైనోఫోబియా ఉంది. అంటే ఏదో అనుకునేరు. కుక్కలంటే భయం అనే కొంచెం స్టైల్ గా చెప్పాను అంతే. కుక్కల గురించి వాటి చరిత్ర గురించి చదివాక నాకున్న తీపి అనుబంధాలని మీతో పంచుకోవడానికి ఈ శునక చరిత్ర మొదలెడుతున్నాను. 

కుక్కలంటే నాలాగే చాలామందికి భయం ఉండవచ్చు కాని నా అంత భయం మాత్రం ఉండదని నొక్కి వక్కానించి వక్కపొడి చేసి మరీ చెప్పగలను. అదేంటో మరి అందరికి కుక్కలు అనగానే విశ్వాసం అనే మనుషుల్లో లేని అరుదైన గుణం గుర్తుకువస్తుంది. కాని నాకు మాత్రం కుక్కలు అన్న వాటి జాతి అన్నా రాజమౌళి సినిమాలో ప్రతినాయకుడి చేతిలో ఉండే పదునైన ఆయుధాల్లాంటి దాని పళ్ళు మాత్రమే గుర్తుకు వస్తాయి.

అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలీకున్నా కూడా జీవితంలో గొప్పవాళ్లు కావాలంటే ఖచ్చితంగా ఎక్కాలు (Mathematical Tables) రావాలి అని వాటిని బట్టీ పడుతున్న అమాయకపు రోజులు....

ఉదయం 6 గంటలకే ఒకప్పుడు నిద్ర లేచేవాణ్ణి అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే ఒకానొక దిక్కుమాలినా రోజు. పాలకేంద్రంకి మా ఇంటికి మధ్యన నేను ఎప్పుడు కనపడుతాన కరిచేద్దాం అని అద్వానీ ప్రధానమంత్రి పదవి కోసం ఎదురుచూసినట్టు ఎదురు చూసే ఒక కుక్క ఉండేది. నేను పాలకి వెళ్తున్నప్పుడు ఎప్పటినుండో నేను నీ కోసమే ఎదురుచూస్తున్న అని కోల్గేట్ ఆడ్ లో మోడల్ ల దాని పళ్ళను చూపి మరీ పలకరించేది (ఎంత మంచి కుక్క). నా అదృష్టం కొద్ది ఎవరైన ఆ దారి వెంట వచ్చేంత వరకు ఎదురుచూసి ఎవరైన రాగానే వాళ్ళకి తెలీకుండానే వాళ్ళను అంటిపెట్టుకుని బతుకుజీవుడా అని తప్పించుకునే వాణ్ణి. కానీ గ్రహాలన్ని ఒకే దగ్గర కూర్చుని దర్నా చేసినట్టు ఆ రోజు ఒక్క మనిషి కూడా కనిపించలేదు. దాంతో ఎన్ని ఫ్లాప్ లు వచ్చిన, తర్వాత సినిమా హిట్టే అని నమ్మి యన్టీఆర్ ఎలాగైతే సినిమాలు తీస్తున్నాడో నేను అలాంటి ఒక గుడ్డి నమ్మకంతోనే అడుగు ముందుకు వేశాను. నేను వేసే ఒక్కొక్క అడుగు నా తొడను కుక్కకు అందుబాటులోకి  తీసుకెళ్తుంది అని తెల్సినా అడుగు ముందుకు వెయ్యక తప్పని పరిస్థితి. నేను ఒక అడుగు ముందుకు వేస్తే అది రెండు అడుగులు ముందుకు వేసింది. అయిన తెగించి ముందుకి పరిగెత్తాను. హీరో మరియు హీరోయిన్ ఇధ్దరు చనిపోయిన తర్వాత కూడా వెంటనే వాళ్ళ మీద రొమాంటిక్ పాట పెట్టినంత చెండాలమైన పని నేను చేసాను అని వెంటనే తెలిసివచ్చింది. అప్పుడు దానికి నాకు మధ్యన పరుగు పందెం మొదలు అయ్యింది.

నా చేతిలో ఉన్న గ్లాసుని దాని మొహనికేసి కొట్టి 100 మీ పరుగు పందెంలో ఉస్సేన్ బోల్ట్ పరిగెత్తినట్టు పరిగెత్తాను. ఆ పరుగు ఎదో ఒలింపిక్స్ లో పరిగెత్తినా బంగారు పతకం నాకే వచ్చి ఉండేది అని ఇప్పటికీ తెగ బాధపడుతుంటాను. వెంటనే దాని ఈగో హర్ట్ అవ్వడం మూలాన నన్ను ఎలాగైనా ఓడించాలని నాకన్నా వేగంగా దాని కాళ్ళకి పని చెప్పింది. బాక్స్ ఆఫీసు దగ్గర నాగ చైతన్య పోరాడినట్టు కొద్దిసేపు పరిగెత్తి అలిసిపోయి నాకు దగ్గరలో ఉన్న ఇంటిలోకి దూరాను. 

లక్ష కోట్ల కుంభకోణం చేసి కూడా తప్పించుకున్న మంత్రి కేవలం లక్ష రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయి మంత్రి పదవి పొగుట్టుకున్నట్టూ నేను దూరిన ఇల్లు ఆ శునక రత్నానిదే అని అది నవ్విన సాడిస్టిక్ నవ్వు చూడగానే అర్ధం అయ్యింది. నేను ఇంటి లోపల ఉన్నాను అది ఇంటి గేట్ దగ్గర నా వైపే చూస్తూ ఇవ్వాళ నాకు లెగ్ పీస్ కన్ఫర్మ్ అని కలలుకంటూ ఉన్నది. వెంటనే నక్సలైట్స్ బాంబులు వేసినట్టు ఒక పెద్ద శబ్దం నానోటి వెంట వెలువడింది. దాన్నే గిట్టని వాళ్ళు ఏడవడం అని కూడా అంటారు. ఏదో జరిగింది కానీ ఏంజరిగిందో తెలియని ఆ ఇంటి యజమాని వండుతున్న కూరని మూకిట్లోనే వదిలేసి బయటికి వచ్చింది. వచ్చి రాగానే పరిస్థితిని అర్ధం చేసుకుని కుక్కని పిలిచింది. నాకేం తెలీదు అంతా ఈ ఎదవే చేశాడు అన్నట్టు ఒక చూపు చూసి తోక ఊపుకుంటూ వెళ్లిపోయింది కుక్క. అలా బతికిపోయాను మొదటిసారి. :)

ఇంకొక సంధర్భం.... నేను పోయిన జన్మలో కుక్కగా పుట్టి ఏదో కుక్కని మోసం చేసి పారిపోయి ఉంటానని నిశ్చయించుకున్న సంధర్భం ఇదే.

నేను మరియు ముగ్గురు స్నేహితులు మేము మాత్రమే దేశాన్ని ఉద్ధరించగలం అని మాకు మేమే గట్టిగా నిశ్చయించుకుని దేశాన్ని ఎలా బాగుచెయ్యలా అని తెగ బాధపడుతూ మా వర్చువల్ ప్రపంచంలో మేము బతుకుతున్న రోజులు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆ సినిమా లో చేసినట్టు చేసి దేశాన్ని మార్చెద్దామ్ అని నిర్ణయించుకుని అలా రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము నలుగురం రోడ్ అంతా మాదే అన్నట్టు ఆక్రమించి నడుస్తున్నాం. ఎందుకైనా మంచిది ఏ కుక్క ఐన చూస్తే దాని పాత పగ గుర్తుకువచ్చి నా మీద దాడి చెయ్యవచ్చు అనే భయంతో నేను మధ్యలో ఉన్నాను. పక్కన ఎంతమంది ఉంటేనేం తాగుబోతు బార్ వైపుకి ఆకర్షితుడు అయినట్టుగా అది సూటిగా సుత్తి లేకుండా నా వైపే పరిగెత్తుకు రావడం గమనించాను.

అప్పుడు ఆ గ్రామసింహం కాస్త నాకు సిటీ సింహంలా కనిపించింది. అప్పుడెప్పుడో ఏదో విపత్తు సంభవించి రాక్షస బల్లుల జాతి మొత్తం అంతరించినట్టు ఇప్పటికిప్పుడు జాగిలజాతి అంతరించాలంటే రావల్సిన విపత్తేమిటి అది రావాలంటే నేనేం చెయ్యాలి అని ఆ క్షణమున పరిపరివిధముల ఆలోచించితిని. కానీ ఎప్పుడు వాడని నన్ను ఇలా అకస్మాత్తుగా వాడినందుకు నీ కాళ్ళకు పరిగెత్తు అని సంకేతం ఇవ్వడం మానేస్తే అదే గ్రామసింహం నీ పిక్కల రుచి చూస్తుంది అని ఒక బలమైన వార్నింగ్ ఇచ్చింది నా మెదడు. ఎందుకొచ్చిన బొడ్డు చుట్టూ సూదిమందులే అని పరిగెత్తాను. కాళ్లకు గాజుపెంకు గుచ్చుకున్నా నా రక్తం ఏరులై పారుతున్న నా ముంధున్న ఒకే ఒక లక్ష్యం నా తొడను మరియు పిక్కను ఏకకాలంలో రక్షించుకోవడం అని యుద్ధంలో వీరుడిలా వాయు వేగంతో దూసుకుపోయాను. మొత్తానికి కుక్క బారి నుండి ఏదోలా బతికి బయటపడ్డాను కానీ అవంటే భయం మరియు అసహ్యాన్ని నా నరనరాన జీర్ణించుకున్నాను. 

అప్పటి నుండి ఇలాంటి సంఘటనలే ఇంకొన్ని సార్లు జరిగాయి కానీ అవి రాసే ఓపిక లేక ఇంతటితో ఈ టపా ముగిస్తున్నాను. ఎక్కువైపోయిన అతిశయాలు మరియు పనికిరాని పోలికలను పట్టించుకోకుండా ఉంటారని ఆశిస్తూ.....




ఉపేందర్

Friday, November 21, 2014

ఒక ఎన్టీఆర్ సినిమా

ఇవ్వాళ్ళే నేను రామయ్య వస్తావయ్య సినిమా చూసాను. అది చూసిన తర్వాత బ్లాగ్ లో ఆర్టికల్ రాయాలన్న ఆలోచన వచ్చింది.

అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది అన్న చందాన ఎన్టీఆర్ తో సినిమా ఇలాగే ఉండాలి అని దర్శకులు అనుకున్నంత కాలం ఆయనకి ఇలాంటి బాధ తప్పదు. ఆయన టాలెంట్ ని గుర్తించి మంచి సినిమా తీస్తే బాక్స్ ఆఫీసు ని కొల్లగొట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. కాని ఈ మధ్యన ఇలాంటి కథలను అటు తిప్పి ఇటు తిప్పి తీస్తున్నారు అని ఆయన అభిమానులే బాధపడుతున్నారు.

అదేంటో మరి ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు తీసిన ఎంతమంది దర్శకులతో తీసిన అదే సినిమా వస్తుంది

దర్శకులంతా కలిసి ఎన్టీఆర్ సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక అగ్రిమెంట్ రాసుకుని దాని ప్రకారం సినిమా తియ్యకపోతే నరకం లో యమధర్మ రాజు గారు అన్ని రాజశేఖర్ సినిమాలు చూపించి మరీ శిక్షిస్తారు అని భయపడి తీస్తారు అనుకుంట వాళ్ళ టెంప్లేట్ సినిమా.

హీరో గారి పరిచయ కార్యక్రమం:

నన్ను ఇంకా ఎవరూ చంపడానికి రావట్లేదు ఏంటి చెప్మా అని ఎదురు చూస్తున్న ఒక 5 రూపాయల ఆర్టిస్ట్ తో ఇంట్రడక్షన్ సీన్. నేను సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్న అని పరిగెత్తుకుంటూ వస్తున్న ఎన్టీఆర్. అవలీలగా అందరిని ఒంటి చేత్తో మట్టి కరిపించి ఎన్టీఆర్ కి చాలా జ్ఞాపక శక్తి ఉంది అని ప్రేక్షకులకు తెలియచేసే ఒక 5 పేజీల డైలాగ్.

ఇప్పుడు సింహాద్రి మరియు యమదొంగ సినిమా లో వేసిన డాన్సు స్టెప్స్ కోసం ఒక పాట కావాలి కాబట్టి ఒక పాట. ఆ పాట కి సాహిత్యం లో తప్పకుండా నేను సింహాద్రి సినిమా తోనే రికార్డ్స్ సంపాదించాను. పక్క గ్రహాల్లో కూడా మా వంశానికి ఉన్న ఘనత ఎవరికీ లేదు మరియు మా తాత గొప్పోడు లాంటివి ఉండాలి.
కాస్సేపు హీరోయిన్ ని ప్రేమిస్తున్న అని చూపే సన్నివేశాలు. మధ్య మధ్య లో సింహాద్రి ఫ్లాష్ బ్యాక్ వల్లనే హిట్ అయింది కాబట్టి ఇందులో కూడా అలాంటి ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి అని గుర్తుచేసే సీన్స్.

ఒక 10 మంది విల్లన్స్ ని చంపాక అది చూసిన హీరోయిన్ కి తన గత జీవితం గురించి కూలంకషగా జ్ఞానబోధ చెయ్యడం. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్…..

మంచిపురం అనే ఒక ఊరిలో హీరో గారిది ఒక పేద్ద ఉమ్మడి కుటుంబం. ఆ ఇంట్లో దానం చెయ్యడానికి మాకు కేవలం 2 కిడ్నీలు మాత్రమే ఉన్నాయి అని తెగ బాధపడే మనుషులు.

ఎన్టీఆర్ ని ఆయన వంశాన్ని దేవుడి లా చూసే ఊరి జనాల బాగుకోసం వాళ్ళ ఆస్తులన్నింటినీ, 2 కిడ్నీలనీ మరియు ఒక గుండె కాయని దానం చేద్దాం అంటే అడ్డుపడే విల్లన్. ఆ విలన్ ని సినిమా చివరలో మాత్రమే చంపాలి అని ముందే అగ్రిమెంట్ లో ఉండడం వల్ల గదని పిసుక్కుంటూ క్లైమాక్స్ దాకా ఎదురుచూసే హీరో.

మధ్యలో 4 భారీ పోరాట సన్నివేశాలు మరియు మా తాత గొప్పోడు అని డైలాగ్స్. అక్కడినుండి చివరికి క్లైమాక్స్ కి వెళ్ళిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం విల్లన్స్ కొంతమందిని చంపేసి తర్వాత జన్మలో కూడా నా కిడ్నీలు మీ కోసమే మరియు మా తాత గొప్పోడు అని 10 పేజీల డవిలాగు.


ఆ దవిలాగుకి మారిపోయిన పెద్ద విల్లన్ కాస్తా అవును నిజమే నువ్వు మరియు మీ తాత ఇద్దరూ గొప్పొల్లే అని ఒప్పుకోవడంతో శుభం.

రిలయన్స్ వారి చిలిపి చేష్టలు

నేను పొట్ట కూటి కోసం పూణే కి వచ్చిన రోజులు అవి……..

నేను తిండి లేకపోయిన సరే బతకగలను కాని ఇంటర్నెట్ లేకుండా బతకలేను అన్న విషయం నెట్ లేకుండా గడిపిన 2 రోజుల్లో తెలిసి వచ్చింది.

లేడికి లేచిందే పరుగు అని రిలయన్స్ నెట్ అడ్వర్టయిజ్‌మెంట్ కనపడగానే కనెక్షన్ కి ఆర్డర్ ఇచ్చాను. అది నేను చెసిన 159 వ తప్పని తెలుసుకోడానికి ఆగడు సినిమా ఫ్లాప్ అని తెలుసుకునేంత సమయం కూడా పట్టలేదు.

వాడికి ఆర్డర్ ఇచ్చిందే తడవుగా కొట్టుకుందాం అంటే ఈగలు దొరకని వాడికి ఒకేసారి 100 ఈగలు దొరికినట్టు తెగ ఆనంద పడిపోయి అప్పటికప్పుడు కనెక్షన్ ఇచ్చి నీకుందిరోయ్ అన్నట్టు చూసి వెళ్లాడు.

నా వాడకానికి లిమిటెడ్ ప్లాన్స్ పనికి రావు అని అన్ లిమిటెడ్ ప్లాన్‌ తీసుకుని వాడు అడిగినంత డబ్బులు వాడి మొహాన కొట్టి వాడడం మొదలు పెట్టాను. అప్పటినుండీ EVV గారి సినిమా లో కథానాయిక కు ఉండే కష్టాలు లాంటివి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైన పొరపాటున ఎడారి లో మినరల్ వాటర్ దొరికినట్టుగా ఒక 10 నిమిషాలు నెట్ వచ్చింది అంటే పవన్‌ కళ్యాణ్ మూవి ప్రీమియర్ షో కి ఫ్రీ గా టికెట్ దొరికినంత ఆనంద పడేవాణ్ణి.

నేను ఏదో నా సిస్టంలో ప్రొబ్లెమ్స్ ఉన్నాయి అనుకునే వాణ్ణి కాని ఆ దగుల్భాజీ రిలయన్స్ వారి సర్వీస్ అలాగే ఉంటుంది అని కనెక్షన్ తీసేసెంత వరకు తెలిలేదు.

నాకు కనెక్షన్ ఇచ్చిన మేనేజర్ కి ఫోన్ చేస్తే వాడు తమన్ ఇచ్చిన మ్యూజిక్ లాగా సిచువేషన్ కి అస్సలు సంబంధం లేని సాంగ్స్ ఇచ్చినట్టు దిక్కుమాలిన కారణాలు అన్ని చెప్పాడు. ఫైనల్ గా అర్ధం ఐన నీతి ఏంటంటే నువ్వు ఆల్రెడీ డబ్బులు కట్టేసావు కాబట్టి తరువాత బిల్ వచ్చేంత వరకు మేం ఇలాగే చేస్తాం నీ దిక్కున్న చోట చెప్పుకో అని. ఫోన్ పెట్టేస్తూ పెట్టేస్తూ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు అని కూర లో కరివేపాకు ల పనికి రాని సలహా ఒకటి ఇచ్చి చచ్చాడు. ఇంకా అక్కడినుండి నాకు కస్టమర్ కేర్ కి యుద్ధం ప్రారంభం.

మొదటి సారి కస్టమర్ కేర్ కి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో మర్యాదగా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని 24 గంటల్లో మేము సమస్యను పరిష్కరిస్తాం అని బాపు గారి సినిమాలో హీరోయిన్ ఉన్నంత ముద్దుగా పద్దతిగా చెప్పారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఆ ఒక రొజుఎలాగోలా కాలయాపన చేసాను.


25 గంటల 6 నిమిషాలకు 2వ సారి కాల్ చేసినప్పుడు, మీ ప్రాబ్లం సాల్వ్ ఐపొయింది సర్ అని రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీ సినిమా తీసినట్టు చెప్పాడు. ప్రాబ్లం సాల్వ్ ఐపొయింది అని ఒక స్టేటస్ అప్‌డేట్ చెయ్యగానే అది నిజం అయిపోదు మాకు నెట్ కూడా రావాలి కదరా బాత్రూమ్ లొ బిర్యానీ తినే తింగరి సన్నాసి అంటే మళ్లీ ఒక కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యండి సర్ 24 గంటలలో సాల్వ్ చెసేస్తాం అని మెడిటేషన్ చెసేవాడికి కూడా ఇరిటేషన్ తెప్పించే సమాధానం చెప్పాడు. మంగలి వాడు కత్తి మెడ మీద పెట్టినప్పుడు వాడితో గొడవ పడకూడదు అని తెల్సిన తెలివైన వాణ్ణి కాబట్టి అన్ని మూసుకుని మరో 24 గంటలు వేచిచూద్దాం అని నిర్ణయించుకున్న.


అలా ఆ రెండు రోజులు భారంగా గడిచిపోయాయి. 3 వ రోజు కూడా కస్టమర్ కేర్ వాడు నా కాల్‌ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు అని కాల్‌ చేసాను. మళ్లీ వాడు శ్రీను వైట్ల సినిమా లో ఉన్న రొటీన్ కథ లాగ మళ్లీ ప్రాబ్లం సాల్వ్ ఐపొయింది సర్ అని చెప్పాడు. మాకు ఇంక నెట్ రాలేదు అని చెప్తే మళ్లీ ఒక కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యండి సర్ 24 గంటలలో సాల్వ్ చెసేస్తాం అని ఎంతో వినయంగా విధేయతతో దేశంలో ఉన్న ప్రొబ్లెంస్ అన్ని మేమే సాల్వ్ చేసేస్తాం అన్నంత గర్వంగా చెప్పాడు.


ఇంక నా ఓపిక నశించి నువ్వు వద్దు నీ పాడు నెట్ వద్దు. మీ సేవలు చాలు మాకు మేము చాల బాగా బుద్ది తెచ్చుకున్నాం వీలైనంత తొందరగా డీ-యాక్టివేట్ చేసేస్తే నా మొబైల్‌ లో ఉన్న 2G నెట్‌వర్క్ తోనే సినిమా రిలీజ్ ముందే టేబుల్‌ ప్రాఫిట్ వచ్చిన నిర్మాత మాదిరిగా సంతోషంగా ఉంటా అని సెలవిచ్చి యోగా చెయ్యడం మొదలుపెట్టాను.

అది గడిచిన 7 రోజులకు (అంటే అప్పటికి మేము కనెక్షన్ తీసుకుని 10 రోజులు అవుతున్నట్టు లెక్క) మాకు ఒక బిల్ ఇచ్చాడు. దాని సారాంశం ఏంటంటే మీరు ఇదివరకే 1800 కట్టేసారు ఇంక 300 కట్టేస్తే సరిపోతుంది అని. మేము తీసుకున్న ప్లాన్ 900 అన్ లిమిటెడ్. దానికి వాడు 10 రోజులకి అదీ వాడని నెట్ కి 2100 ఎలా బిల్ ఏసాడు అని ఆలోచిస్తే తేలిన విషయం ఏంటంటే డబ్బులు దొబ్బడం రిలయన్స్ జన్మ హక్కుఅనేది వాడు పాటించే ఏకైక సూత్రం అని.

అప్పటి నుండి ఎవడైనా నా ముందు రిలయన్స్ ని పొగిడితే రాజమౌళి సినిమా లో విలన్‌ అంత పవర్‌ఫుల్ గా మారుతున్నట్టు నా స్నేహితులు చెప్పే వరకు తెలిసిరాలేదు.



నా గురించి కొంచం సొల్లు

నా గురించి చెప్పాలంటే ఏమీ లేదు. కాని బ్లాగ్ మొదలు పెట్టాను కాబట్టి ఏదో ఒకటి తప్పక రాయని పరిస్థితి. ఏం చేస్తాం కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లకు పుట్టలకు మానులకు మట్టి గడ్డలకు వస్తాయా?

సరే కాని ఈ సోది వదిలేసి అసలు సిసలైన సొల్లులోకి వస్తే నా నామధేయం ఉపేందర్.

నేను పుట్టి పెరిగింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పుకునే వాణ్ణి కాని ఇప్పుడు తెలంగాణ అని చెప్పుకోవాలి.


ప్రస్తుతం కాట్రాజ్ అనే ఒక చిన్న పల్లెటూరు కి 14.2 కిలోమీటర్ ల దూరంలో ఉన్న పూణే అనే పట్టణం లో ఏదో దిక్కుమాలిన ఆఫీస్ లో ఎప్పుడూ నిద్రపోతూ అప్పుడప్పుడు పని చేస్తూ (డామేజర్ వచ్చినప్పుడు) ఉన్నాను.