Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Friday, February 13, 2015

పనిలేక రాస్తున్నపనికిరాని రివ్యూ (టెంపర్)

మొట్టమొదటి సారిగా ఒక సినిమా కి రివ్యూ రాయాలని అనిపించింది. ఎందుకంటే ఏం చెయ్యాలో తెలీక ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఆ సినిమానే టెంపర్. ఈ రివ్యూ చదివి సినిమా చూడాలా వద్దా అని మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే సినిమా బాగుందా బాలేదా అని విశ్లేషించే అంత విషయం అయితే నా దగ్గర లేదు. నేను ఒక డాటా అనలిస్ట్ ని కానీ మూవీ అనలిస్ట్ ని కాదు కావున అసలు ఇది రివ్యూనేనా కాదా అనే అనుమానం వస్తే నన్ను కొంచెం పెద్ద మనసుతో క్షమించెయ్యండి.

తారాగణం: అందరూ తెలిసిన నటీనటులే

నాకు నచ్చినవి:

  • కాజల్ పళ్ళు. ఎందుకంటే చాలా తెల్లగా ఉన్నాయి అని మనకు చాలా సార్లు చూపించింది కాబట్టి.
  • ప్రకాష్‌రాజ్ మరియు NTR తాగి పడేసిన మందు బాటల్స్ ఆకారం. వీలైతే అవన్నీ తెచ్చుకుని మా ఇంట్లో పెట్టుకోవాలి అన్నంత బాగా నచ్చాయి ఆ బాటల్స్.
  • NTR వేసుకున్న చొక్కాలు.
  • ప్రకాష్‌రాజ్ ధరించే షార్ట్స్. ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని కొనుక్కుందాం అనుకుంటున్నాను.
  • 2వ పాటలో ఒక ఫ్రేమ్ లో కాజల్ నడుచుకుంటూ వచ్చే విధానం.

నాకు నచ్చని అంశాలు:

  • ఒకసారి మధురిమ ఏడ్చే సన్నివేశంలో కళ్ళకి కాటుక సరిగ్గా పెట్టుకోలేదు అనిపించింది. మేకప్ వేసిన వాళ్ళు కొంచెం చూసుకుని ఉండాల్సింది.
  • అలీ మీసాలు
  • సినిమాలో 20 పైన కుక్కలున్నాయి. అవి కూడా నాకు నచ్చలేవు. ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
  • చివరి విల్లన్ సుబ్బరాజు NTR చేతుల్లో కుక్కచావు చావడానికి భయపడి తనంతాల తానే ఆత్మహత్య చేసుకోవడం. విల్లన్లు అందరినీ హీరో ఛంపితేనే నాకొక చిన్న సంతృప్తి.

విశ్లేషణ (లాంటిది):

హీరో కొట్టడానికి బోలెడంత మంది విలన్స్ ఉన్నారు కాబట్టి NTR తనకొచ్చినట్టు చితక్కొట్టేసాడు. సంగీత దర్శకుడికి నిర్మాత డబ్బులిచ్చాడు కాబట్టి హీరో డ్యాన్స్ చెయ్యడానికి బోలెడన్ని పాటలు కూడా ఇచ్చాడు. సినిమా పేరు టెంపర్ మరియు హీరో గారికి ఒక వంశం ఉంది కాబట్టి ఆ రెండు కలిసేలా "నీ తాత టెంపర్. నీ అయ్యా టెంపర్. బాబాయి టెంపర్" అని అత్యద్భుతమైన సాహిత్యం రాశారు కవి గారు. వారి పాదాలకు నాయొక్క వందనాలు. సినిమా లో ఏం లేకపోయినా సరే ఒప్పుకుంటాం కానీ హీరో గారికి జతగా హీరోయిన్ లేకపోతే మేం ఒప్పుకోం అనే అభిమానులు తెలుగు హీరోలకి ఉండడం వల్ల హీరోయిన్ ని కూడా పెట్టాల్సి వచ్చింది.

మిగతావన్నీ పక్కన పెడితే కధనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పూరీ గారు పకడ్బందీగా రాసుకున్నారు. ప్రతి చిన్న సన్నివేశాన్ని కూడా లింక్ చేస్తూ ద్వితీయార్ధంని రాసుకున్న విధానం సూపర్. చాలా చిన్న సన్నివేశమే కదా అని అనుకున్నది కూడా రెండవ భాగం కి వచ్చేసరికి దాని విలువని తెలియచెస్తుంది. 

ఉదాహరణకి NTR కాజల్ ని నువ్వేం తింటావ్ అని అడిగినప్పుడు పప్పు ఆవకాయ అప్పడం లాంటివి చెబుతుంది. అది చాలా మామూలు సన్నివేశం కానీ చివరిసారిగా నువ్వేం తింటావ్ అని పోలీసులు NTR ని అడిగినప్పుడు తాను కూడా అది గుర్తుకు తెచ్చుకుని చెప్పడం వల్ల ఆ సన్నివేశం అనుకున్న దానికన్నా ఎక్కువగా పండింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. 

మొదటి భాగంలో హీరోని అసహ్యించుకునే వరకు వెళ్తాం కాబట్టి ప్రేక్షకులతో ఆ charecter కనెక్ట్ అయ్యినట్టే. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ మంచి వాడిగా మారడానికి గల కారణం కూడా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. చాలా సినిమా ల్లో చూసినట్టు అకస్మాత్తుగా హీరో మంచివాడుగా మారడంలా కాకుండా దానికి బలమైన సన్నివేశాలు రాయడంలో దర్శకుడు విజయం సాధించాడు.

చివరి వాక్యం: NTR అభిమానులు సినిమా ఎలాగూ చూస్తారు. మిగతావాళ్ళకి సినిమా నచ్చుంటుందో లేదో తెలుసుకోవాలి అంటే వాళ్ళు కూడా సినిమా చూసి నిర్ణయం తీసుకుంటేనే ఉత్తమం.

Friday, November 21, 2014

ఒక ఎన్టీఆర్ సినిమా

ఇవ్వాళ్ళే నేను రామయ్య వస్తావయ్య సినిమా చూసాను. అది చూసిన తర్వాత బ్లాగ్ లో ఆర్టికల్ రాయాలన్న ఆలోచన వచ్చింది.

అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది అన్న చందాన ఎన్టీఆర్ తో సినిమా ఇలాగే ఉండాలి అని దర్శకులు అనుకున్నంత కాలం ఆయనకి ఇలాంటి బాధ తప్పదు. ఆయన టాలెంట్ ని గుర్తించి మంచి సినిమా తీస్తే బాక్స్ ఆఫీసు ని కొల్లగొట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. కాని ఈ మధ్యన ఇలాంటి కథలను అటు తిప్పి ఇటు తిప్పి తీస్తున్నారు అని ఆయన అభిమానులే బాధపడుతున్నారు.

అదేంటో మరి ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు తీసిన ఎంతమంది దర్శకులతో తీసిన అదే సినిమా వస్తుంది

దర్శకులంతా కలిసి ఎన్టీఆర్ సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక అగ్రిమెంట్ రాసుకుని దాని ప్రకారం సినిమా తియ్యకపోతే నరకం లో యమధర్మ రాజు గారు అన్ని రాజశేఖర్ సినిమాలు చూపించి మరీ శిక్షిస్తారు అని భయపడి తీస్తారు అనుకుంట వాళ్ళ టెంప్లేట్ సినిమా.

హీరో గారి పరిచయ కార్యక్రమం:

నన్ను ఇంకా ఎవరూ చంపడానికి రావట్లేదు ఏంటి చెప్మా అని ఎదురు చూస్తున్న ఒక 5 రూపాయల ఆర్టిస్ట్ తో ఇంట్రడక్షన్ సీన్. నేను సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్న అని పరిగెత్తుకుంటూ వస్తున్న ఎన్టీఆర్. అవలీలగా అందరిని ఒంటి చేత్తో మట్టి కరిపించి ఎన్టీఆర్ కి చాలా జ్ఞాపక శక్తి ఉంది అని ప్రేక్షకులకు తెలియచేసే ఒక 5 పేజీల డైలాగ్.

ఇప్పుడు సింహాద్రి మరియు యమదొంగ సినిమా లో వేసిన డాన్సు స్టెప్స్ కోసం ఒక పాట కావాలి కాబట్టి ఒక పాట. ఆ పాట కి సాహిత్యం లో తప్పకుండా నేను సింహాద్రి సినిమా తోనే రికార్డ్స్ సంపాదించాను. పక్క గ్రహాల్లో కూడా మా వంశానికి ఉన్న ఘనత ఎవరికీ లేదు మరియు మా తాత గొప్పోడు లాంటివి ఉండాలి.
కాస్సేపు హీరోయిన్ ని ప్రేమిస్తున్న అని చూపే సన్నివేశాలు. మధ్య మధ్య లో సింహాద్రి ఫ్లాష్ బ్యాక్ వల్లనే హిట్ అయింది కాబట్టి ఇందులో కూడా అలాంటి ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి అని గుర్తుచేసే సీన్స్.

ఒక 10 మంది విల్లన్స్ ని చంపాక అది చూసిన హీరోయిన్ కి తన గత జీవితం గురించి కూలంకషగా జ్ఞానబోధ చెయ్యడం. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్…..

మంచిపురం అనే ఒక ఊరిలో హీరో గారిది ఒక పేద్ద ఉమ్మడి కుటుంబం. ఆ ఇంట్లో దానం చెయ్యడానికి మాకు కేవలం 2 కిడ్నీలు మాత్రమే ఉన్నాయి అని తెగ బాధపడే మనుషులు.

ఎన్టీఆర్ ని ఆయన వంశాన్ని దేవుడి లా చూసే ఊరి జనాల బాగుకోసం వాళ్ళ ఆస్తులన్నింటినీ, 2 కిడ్నీలనీ మరియు ఒక గుండె కాయని దానం చేద్దాం అంటే అడ్డుపడే విల్లన్. ఆ విలన్ ని సినిమా చివరలో మాత్రమే చంపాలి అని ముందే అగ్రిమెంట్ లో ఉండడం వల్ల గదని పిసుక్కుంటూ క్లైమాక్స్ దాకా ఎదురుచూసే హీరో.

మధ్యలో 4 భారీ పోరాట సన్నివేశాలు మరియు మా తాత గొప్పోడు అని డైలాగ్స్. అక్కడినుండి చివరికి క్లైమాక్స్ కి వెళ్ళిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం విల్లన్స్ కొంతమందిని చంపేసి తర్వాత జన్మలో కూడా నా కిడ్నీలు మీ కోసమే మరియు మా తాత గొప్పోడు అని 10 పేజీల డవిలాగు.


ఆ దవిలాగుకి మారిపోయిన పెద్ద విల్లన్ కాస్తా అవును నిజమే నువ్వు మరియు మీ తాత ఇద్దరూ గొప్పొల్లే అని ఒప్పుకోవడంతో శుభం.