Thursday, February 11, 2016

రైలులో రైతు బజార్

ఒరేయ్ ఉపేందర్ నువ్వు ఎక్కవాల్సిన రైలు నాలుగవ ఫ్లాట్ ఫారం మీదకు వచ్చును అని ఒక బొంగురుపోయిన గొంతు తెలుగు హిందీ ఇంగ్లీష్ మాథ్స్ సైన్స్ సోషల్ భాషలో చెప్పింది.

ఓ అలాగా! సరే అని నేను కూడా బొంగురు గొంతుతో సమాధానం చెప్పి వెళ్లి అక్కడ ఇద్దరు అమ్మాయిల మధ్యన ఖాళీ ఉంటే ఆ బెంచ్ పైన కూర్చుని రైలు కోసం ఎదురు చూస్తున్న.

ఇంతలో నేను ఎక్కవాల్సిన రైలు రానే వచ్చింది. చార్ట్ లో నా పేరు చూసి ఎక్కి నా సీట్ లో నేను కూర్చున్నాను. హయ్యమ్మ ఇంకా హాయిగా పాటలు వింటూ పుస్తకాలు చదువుతూ వెళ్లిపోవచ్చని ఆనందపడుతూ చేతిలో ఉన్న స్వాతి బుక్ తెరిచాను. తెరవగానే నా కళ్ళు వారఫలం మీద పడ్డాయి. ఈ వారం నా జాతకం ఎలా ఉందో చూసుకుందాం అని చదవడం మొదలు పెట్టాను.దైనందిక జీవితంలో ఊహించని మలుపులుంటాయి అని ఉంది. రోజు చూసే మలుపులే కదా. సాఫ్ట్వేర్ బతుకులో ఉన్నన్ని మలుపులు ఇంకెక్కడా ఉండవులే అని అనుకుని ఎంపీ3 పెట్టుకుని పాటలు వింటున్నాను.


ఒక్క పాట  విన్నానో లేదో  సముద్రంలో సునామి, వైజాగ్ లో హుద్ హుద్, చెన్నై లో వర్షం మరియు ఒక భయంకరమైన ప్రవాహం వచ్చి నా ఎదురుగా నలుగురు అమ్మాయిల రూపంలో కూర్చునాయి. వారఫలంలో చెప్పినట్టు ఊహించని మలుపు అంటే నా ప్రయాణం అందమైన అమ్మాయిలతో రంగులమయం కావడం అన్నట్టు.


ఆహా ఎంత అదృష్టం.


వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళని తీక్షణంగా చూడడం బాగోదు కాబట్టి కాసేపు వాళ్ళను పట్టించుకోనట్టు నటించి తర్వాత మెల్లిగా మాటలు కలుపుదాం అనుకుని కళ్ళు మూసుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అలా కాసేపు అనుభవించాక కళ్ళు తెరిచి చూస్తే హైదరాబాద్ రైతు బజార్ మా కంపార్ట్మెంట్ లోకి వచ్చిందా అన్నంత ఆశ్చర్యం.


నేను పుట్టినప్పటి నుండి ఇప్పటికీ ఎన్ని తిన్నానో అన్ని చిప్స్ ప్యాకెట్స్, 4 డ్రమ్ముల కూల్ డ్రింక్స్, హాస్పిటల్ లో పంచడానికి సరిపడా పండ్లు మరియు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు తినడానికి పులిహోర, చపాతీలు, గారెలు, బూరెలు లాంటి పలురకాల వంటకాలున్న కవర్స్ ని మరియు బాగ్స్‌ని వాళ్ళకి అందుబాటులో పెట్టుకొని పుస్తకాలు లాంటి పనికి రాని బ్యాగ్స్ ని లోపలికి తోసి హమ్మయ్య ఇంకా రెండు మూడు గంటల వరకు ఎం కొనుక్కోకున్న పరవాలేదు అని ప్రశాంతంగా ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చున్నారు.


కాసేపు అంత నిశ్శబ్దంగా ఉండి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించాక పదార్థాలను తినడం ఆరంభించారు. వాళ్ళు కాస్తంత ఎనర్జీ రాగానే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ మాట్లాడుకోవడం కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళింట్లో ఉన్న వాళ్లకు కూడా వినిపించేలా జాగ్రత్త పడుతున్నారు కావున నా ఎంపీ3 నా మాట వినడం మానేసి మూగబోయింది. నా చెవులు ఎంత చెప్పిన వినకుండా వాళ్ళ మాటలను ఎక్కించుకోవడం ప్రారంభించాయి. ఎంతైనా అమ్మాయిలు అందులో అందంగా ఉన్నారు కావున నేను కూడా పెద్దగా ఇబ్బంది పడడం లేదు.


సరే అయితే ఏం మాట్లాడుతున్నారో అని వినడం ప్రారంభించాను. వాళ్ళు చీమ ఎందుకు చిన్నగా ఉంటుంది అనే విషయం నుండి బరాక్ ఒబామా వాడే టూత్ పేస్టు  లో ఉప్పు ఉంటుందా లేదా అని ప్రతీ విషయం పైన చర్చిస్తున్నారు. అన్ని విషయాలలో వాళ్ళకున్న పట్టుచూసి తెగ ముచ్చటపడ్డాను. ఎంతైనా అందమైన అమ్మాయిలు కదా! ఇలా కొన్ని గంటల పాటు వాళ్ళ వాగ్ధాటి కొనసాగాక పక్కనే ఒక అర్భకుడు ఉన్నాడు పాపం అని కాస్త విరామం ఇచ్చి మిగిలినవి తింటున్నారు. వాళ్ళు తిని నేను తినకపోతే నాలోని ఆత్మారాముడు ఊరుకోడు కాబట్టి కడుపులో ఎలకలకి నేను కూడా కాస్తంత మేత పడేసాను. 


వాళ్ళవి మరియు కంపార్ట్మెంట్ లో ఉన్న అందరివి తినేసాక కొంచెం తీరికగా తర్వాత ఏమేం విషయాల గురించి చర్చించాలో అని వాళ్ళలో వాళ్ళే వాదించుకుంటున్నారు. ఎలాగైతేనేం మొత్తానికి ఒక ఒప్పందానికి వచ్చినట్టున్నారు అనిపించింది అక్కడున్న ప్రశాంత వాతావరణం చూసి. ఎవరికో కాసేపు ఫోన్ ప్రయత్నించిన తర్వాత అందరిలో ఆందోళన మొదలయ్యింది. అప్పటిదాకా తినడం వాదించుకోవడం మాత్రమే కాకుండా మొదటిసారి వాళ్ళు ఇంకా ఎదో చేస్తున్నారని గ్రహించి అదేంటో తెల్సుకోకపోతే నా జన్మ వ్యర్ధం అని ఎలా వాళ్ళని అడగాల అని ఆలోచించుకుంటున్నా. నా బాధే వాళ్ళు తీరుద్దాం అని వాళ్ళే అనుకున్నారో లేదా వాళ్ళ పైత్యం నాకు అంటిద్దాం అని ఆ భగవంతుడు అనుకున్నాడో తెలీదు కాని వాళ్ళే నాతో మాట్లాడడం ప్రారంభించారు. 


వాళ్లెప్పుడు పుట్టారు ఏ ఏ స్కూల్లో ఎంత వరకు చదువుకున్నారు. 8వ తరగతిలో ఉన్నప్పుడూ వాళ్ళను వాళ్ళ టీచర్ ఎలా మెచ్చుకున్నాడు వగైరా ముక్యమైన అన్ని విషయాలు అరగంట పాటు చెప్పిన తర్వాత నాకర్ధం అయ్యింది ఏంటంటే వాళ్ళు మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళు వెళ్ళవలసిన చోటుకి తీసుకెళ్తా అని మాటిచ్చిన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ కలవట్లేదు కాబట్టి ఎలా వెళ్ళాలా అని నన్ను సహాయం చెయ్యమని అడుగుతున్నారు అని. వాళ్ళు అడిగితే నా కిడ్నీ తప్ప ఏదైనా సహాయం చెయ్యడానికి నేను రెడీగా ఉండడం వాళ్ళ ఎక్కడ దిగాలి ఎలా వెళ్ళాలి మొదలైన అన్ని విషయాలు వాళ్ళు చెప్పినంత కాకపోయినా ఒక మోస్తరుగా బాగానే వివరించాను. బాగ ఆకలిగా ఉన్నప్పుడు మృష్టాన్న భోజనం దొరినట్టుగా తృప్తిగా చూసారు నన్ను.  పర్లేదు పర్లేదు ఆ మాత్రం దానికే ఎందుకండీ ఇంతలా నన్ను పొగడడం పరవాలేదు పరవాలేదు అని నన్ను పొగడబోతున్న వాళ్ళని వద్దని వారించాను.


మొత్తానికి ఎలాగోలా మా రైలు ప్రయాణం ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అయ్యింది. వాళ్ళు వెళ్ళవలసిన చోటుకి వెళ్లారో లేదో తెలీదు కాని నేను మాత్రం వాళ్ళను ఎప్పటికి మర్చిపోనంతగా నా మెదడుని తిన్నారు. వాళ్ళను మళ్ళీ కలుస్తానో లేదో తెలీదు ఎందుకంటే ప్రయాణాలలో జరిగిన పరిచయాలు చాల విచిత్రమయినవి మరియు యాదృచ్చికమయినవి. 




ఇది జరిగి సరిగ్గా మూడు నెలల తర్వాత...



విధి సంకల్పమో లేదా యాదృచ్చికమో తెలీదు కాని నేను పని చేస్తున్న ఆఫీస్ లొనే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది మా ఆఫీస్ లోనే అంట. ఆ విషయం తప్ప అన్నివిషయాలు చెప్పారు అప్పుడు. ఎందుకంటే మాట్లాడవాల్సినవి తప్పా మిగతావన్నీ మాట్లాడడం వాళ్ళకున్న ఏకైక మంచి లక్షణం. ఇక్కడ వాళ్ళ అదృష్టం కొద్ది నేను తప్ప వాళ్లకెవరు తెలీదు నా దురదృష్టం కొద్ది నేను తప్ప వాళ్లకేవరు తెలీదు. (రెండు ఒక్కటే) కావున ఒకేసారి తినేస్తే తర్వాత రోజు నుండి తినడానికి ఏమి ఉండదు కాబట్టి ముందుచూపుతో రోజు కాస్తంత వాయిదాల పద్దతిలో నా బుర్రని తినడం మొదలెట్టారు. అమ్మలరా అక్కలార నాకున్న ఒకే ఒక బుర్రని మీరే తినేస్తే రేపు పొద్దున్న నా భార్య తినడానికి ఏమి ఉండదు కావున నాయందు మిక్కిలి దయతలిచి కాస్తంత బుర్రని వదిలేస్తే దాన్ని ఎలాగోలా ఉపయోగించి మీకు రోజుకొక మట్టిబుర్రని అప్పచెప్తాను. వాళ్ళను తినడమే న్యాయం అని పరస్పర అంగీకార ఒప్పందానికి వచ్చాక కాని నన్ను వదలలేరు.


మరిసాటి రోజు: ఎప్పుడు తనలో తానే ఆలోచించుకుంటూ బాహ్యప్రపంచంతో సంబంధం లేని ఒకానొక బకారాని వాళ్లకు పరిచయం చేసి నేను తప్పించుకోవడం జరిగింది.